సర్వే నెం.227లో 353.35 ఎకరాలు..! పోరంబోకు భూమిగా నిర్ధారణ..!

పట్టాభూమిగా పత్రాల్లేవు, ఆధారాల్లేవని అడిషనల్ కలెక్టర్ స్పష్టత..

బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిపై సంచలన తీర్పు..

కేసు నంబర్: E1/229/2024.. తేదీ: 29 అక్టోబర్ 2025న తీర్పు వెల్లడించారు..

2004 నాటి హైకోర్టు ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపణ..!

2009-09-09న ప్రభుత్వ భూమిగా ప్రొసీడింగ్ జారీపై సొసైటీ అభ్యంతరం..

ఈ మేరకు పునఃపరిశీలనకు కలెక్టర్‌ను మళ్ళీ విచారణకు ఆదేశించిన హైకోర్టు..

విచారణ అనంతరం సాయినాథ్ సొసైటీతో పాటు, మొత్తం 353.35 ఎకరాలు ప్రభుత్వ భూమిగా తీర్పు..

భూమికి పత్రాలు లేవు, స్పష్టమైన ఆధారాలు లేవని పిటిషన్ తిరస్కరించిన అడిషనల్ కలెక్టర్..

సర్వే నంబర్ 227 మొత్తం 353.35 ఎకరాలు పొరంబోకు భూమిగా నిర్ధారణ..

951-52 ఫహానీ, సేత్వార్ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్నట్టు స్పష్టీకరణ.. 

అనుకున్నదొక్కటి..! అయింది ఒక్కటి..! బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట..! అంటూ ఓ సినీ గేయ రచయిత రాసిన ఈ గీతం..! బహుదూర్‌పల్లి సర్వే నెం. 227 ప్రభుత్వ భూమిలోని సాయినాథ్ సొసైటీ కబ్జాదారుల యవ్వారానికి సరిగ్గా సరిపోతుంది.. ఇందులో కొందరు అవినీతి అధికారుల హస్తం లేకుండా, సాధ్యం కాదనే విమర్శలు కూడా లేకపోలేదు..! సుమారు 25 ఏళ్ళ క్రితమే, సాయినాథ్ సొసైటీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను రెవెన్యూ "ఎన్‌వోసి"ని కోరగా..! నాటి జిల్లా కలెక్టర్ "సీసీఎల్‌ఎ కమిషనర్"కి ప్రతిపాదనలు పంపించారు.. దీంతో 227 మొత్తం 353.35 ఎకరాలు సర్కారీ పోరంబోకు భూమిగా నిర్ధారించి.. "సీసీఎల్‌ఏ కమిషనర్" ఎన్‌వోసి తిరస్కరించారు.. వెంటనే సొసైటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో.. 25 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలోనే కేసు‌ కొనసాగుతుంది.. ఈ 25 ఏళ్ళలో మొత్తం 353.35 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమిగానే స్పష్టమైన ఆధారాలతో, 2009లోనూ అప్పటి జాయింట్ కలెక్టర్ జగన్మోహన్ రావు ఐఏఎస్ ప్రొసీడింగ్‌ జారీ చేసినప్పటికీ..! అధికారుల వైఫల్యంతో నేటికీ అక్రమార్కుల ఆధీనంలోనే, ప్రభుత్వ భూమి బందీగా ఉండటం గమనార్హం.. ఇప్పుడు మూడవసారి కూడా, హైకోర్టు ఆదేశాలతో విచారణ అనంతరం, ప్రభుత్వ భూమిగా తీర్పును వెల్లడించారు.. ఇప్పుడైనా స్వాధీన పరుచుకుంటారా..? లేక‌ అక్రమార్కులకు అప్పగించే వరకు నిర్లక్ష్యం వహిస్తారా వేచి చూడాలి..

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, నవంబర్ 9:

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ మండలం బహుదూర్‌పల్లి గ్రామ శివారు సర్వే నెం.227 లోని మొత్తం 353.35 ఎకరాలు  మూడవసారి కూడా సర్కారీ పోరంబోకు భూమిగానే నిర్ధారణ అయింది..ఏడాది క్రితం (2024 అక్టోబర్ 29) హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.విజయేందర్ రెడ్డి, 2025 అక్టోబర్ 29న విచారణ అధికారిగా ఆయన ఈ తీర్పును వెల్లడించారు.. సాయినాథ్ సొసైటీ వారికి "పత్రాలు‌ లేవు, ఆధారాలు లేవని" ఏడాదిపాటు విచారణ అనంతరం, 227 మొత్తం 353.35 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమిగా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్పష్టతను ఇచ్చారు.. గత 25 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలోనే ఉన్న ఈ 227 సర్కారీ భూ వివాదంలో 3 సార్లు ప్రభుత్వ భూమిగానే తేల్చారు..

తీర్పులో..! ప్రభుత్వ భూమిగానే ఆధారాలు..

బహుదూర్‌పల్లి గ్రామం సర్వే నంబర్ 227 మొత్తం 353.35 ఎకరాలు పొరంబోకు సర్కారీ భూమిగా "1951-52 ఫహానీ" మరియు "సేత్వార్ అండ్ సెసల్" రికార్డుల్లో ఉన్నట్టు దుండిగల్‌ గండిమైసమ్మ మండలం తహసీల్దార్ సమర్పించిన నివేదికల ద్వారా నిర్ధారితమైందని అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ పేర్కొన్నారు.. రికార్డుల్లో  పట్టదారు కాలమ్‌లో ఎవరి పేర్లు లేవని స్పష్టీకరించారు.. అదే విధంగా కొంత భాగం (227/1 నుండి 227/23 వరకు) మొత్తం 200 ఎకరాలు + 153.35 ఎకరాలు, మొత్తం 353.35 ఎకరాలు ప్రభుత్వ భూమిగానే నమోదైనట్లు తీర్పులో వెల్లడించారు..

 

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.