గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్ 27:తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని గూడెం కొత్త వీధి సర్పంచ్ సుభద్ర విజ్ఞప్తి చేశారు. జి.కె. వీధి మండల పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రజలకు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను సమయానికి చేరవేయాలని, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు.
పాత, బలహీన ఇళ్లలో నివసించే వారు, నదీ తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, వృద్ధులు, చిన్న పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సుభద్ర సూచించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తుఫాను సమయంలో అనవసర ప్రయాణాలు మానుకోవాలని, అధికారుల సూచనలను తప్పక పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు, ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు మండల యంత్రాంగం అన్ని విధాలా సిద్ధంగా ఉందని సర్పంచ్ తెలిపారు. ప్రజలు భయాందోళన చెందకుండా ధైర్యంగా వ్యవహరించి అధికారులకు సహకరించాలని ఆమె కోరారు.