దేశ రాజకీయాల్లో కీలకమవుతున్న బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున తెలుగు నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నారు. ఇండియా కూటమి సవాల్‌ను ఎదుర్కొనేందుకు బిజెపి, జేడీయూ గట్టి వ్యూహం రూపొందించగా, ఈ ఇద్దరు తెలుగు నేతల ఇమేజ్‌తో ప్రచారానికి బలాన్నివ్వాలనే యోచనలో ఉన్నారు.
విజయవాడ, పెన్ పవర్ అక్టోబరు 27 :
దేశ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏకు బీహార్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇండియా కూటమి బలంగా నిలుస్తున్న వేళ, అక్కడ గెలుపు సాధించాలంటే స్టార్ ప్రచారకర్తల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌ను బీహార్ ప్రచారానికి ఆహ్వానించినట్లు సమాచారం.గతంలో ఢిల్లీలో ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు జాతీయస్థాయిలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన ప్రచారంలో పాల్గొనబోయినా కుటుంబ విషాదంతో మధ్యలో తిరిగి వచ్చారు. ఈసారి బీహార్ ప్రచారంలో తన పాల్గొనబోతున్నట్లు చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.అలాగే పవన్ కళ్యాణ్ కూడా హిందూ పరిరక్షణ, సనాతన ధర్మం అంశాలపై తన స్పష్టమైన వైఖరితో జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. పవన్ ప్రచారం చేస్తే హిందూ ఓటు బ్యాంక్ ఎన్డీఏ వైపు మళ్లుతుందని బిజెపి అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కూడా బీహార్ ప్రచారంలో పాల్గొనే అవకాశముంది.వచ్చే నెల 14–15 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ నేతలు బిజీగా ఉన్నా, ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేర్వేరుగా బీహార్ వెళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నారు.