మొంథా తుపానుగా బలపడిన వాయుగుండం — హై అలర్ట్‌లో ప్రభుత్వం

cyclone-montha-strengthens-—-govt-on-high-alert

  • బంగాళాఖాతంలో 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన తుపాను
  • మంగళవారం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
  • తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
  • సహాయక చర్యలకు రూ.19 కోట్లు — ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి ‘మొంథా’ తుపానుగా మారింది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.

 

 

 

విశాఖ, పెన్ పవర్ అక్టోబర్ 27:
బంగాళాఖాతంలో నైరుతి–ఆగ్నేయ మధ్య భాగంలో కేంద్రీకృతమైన వాయుగుండం బలపడి మొంథా తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ప్రస్తుతం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 680 కి.మీ, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 600 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 16 కి.మీ వేగంతో పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు.మంగళవారం ఉదయానికి ఇది తీవ్రమైన తుపానుగా మారి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా. తీరం దాటే సమయంలో గంటకు 90–110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని హెచ్చరించారు. మచిలీపట్నం–కళింగపట్నం మధ్య తీరప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తుపాను దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అన్ని శాఖల అధికారులకు సెలవులు రద్దు చేశారు. సహాయక చర్యల కోసం రూ.19 కోట్లు విడుదల చేయడంతో పాటు ఎస్డీఆర్‌ఎఫ్‌, ఏపీఎస్‌డీఎంఏ కేంద్రాలు, 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు. 57 తీర మండలాల్లో 219 తుపాను షెల్టర్లు సిద్ధం చేశారు. సముద్రంలోని మెకనైజ్డ్ బోట్లు ఒడ్డుకు రప్పించగా, తీర ప్రాంతాల్లో పర్యాటక రాకపోకలను నిషేధించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో ఎల్లుండి వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడపలో రేపటి వరకు సెలవులు ఉండగా, నెల్లూరు జిల్లాలో నేడు సెలవు ప్రకటించారు.జిల్లాల్లో విపత్తు బృందాలు మోహరించాయి. 9 ఎస్డీఆర్‌ఎఫ్‌, 7 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయశిబిరాలు, తాగునీరు, ఆహార ఏర్పాట్లు చేపట్టేందుకు టీఆర్‌–27 కింద నిధులు మంజూరు చేశారు.

About The Author: Admin