విజయవాడ, ఫిబ్రవరి 16 (పెన్ పవర్ ప్రతినిధి)
రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి క్రమశిక్షణపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి , పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రజా ప్రతినిధుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే మార్పు అవసరాన్ని గట్టిగా సూచించారు.
“మారకపోతే మీకే నష్టం” అంటూ ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేసిన సీఎం, ప్రతి ఒక్కరికీ సీల్డ్ కవర్‌లో వ్యక్తిగత నివేదిక అందజేస్తున్నామని వెల్లడించారు. మొత్తం తొమ్మిది పరామితుల ఆధారంగా సర్వే నిర్వహించి ఈ నివేదికలను సిద్ధం చేశామని తెలిపారు. ప్రజాభిప్రాయం, అభివృద్ధి పనులు, ప్రజా చేరిక, పార్టీ పట్ల నిబద్ధత, పారదర్శకత వంటి అంశాలను పరిశీలించామని పేర్కొన్నారు. అంతేకాకుండా, వారికి తెలియని మరికొన్ని కీలక ప్రమాణాలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి నేతల్లో ఆత్మపరిశీలన అవసరాన్ని గుర్తుచేశారు. 1995-96 కాలంలో తన విధానాలు ఎంత కఠినంగా ఉన్నాయో, ఇప్పటికీ అదే నిక్కచ్చితనంతో వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. నాయకత్వంలో క్రమశిక్షణ, బాధ్యత తప్పనిసరి అన్న సందేశాన్ని ఆయన స్పష్టంగా అందించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై వివరణ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా సీఎం విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని, ప్రస్తుతం రాష్ట్రం తిరిగి గాడిలో పడే దశలో ఉందని తెలిపారు. ఆదాయం తక్కువగా ఉండగా ఖర్చులు ఎక్కువగా ఉండటం వారసత్వంగా వచ్చిందని వ్యాఖ్యానించారు. కేంద్ర సహకారంతో పరిస్థితులను సమర్థంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
వ్యవసాయం, సేవా రంగాల్లో ఆదాయం పెరగాల్సిన అవసరం ఉందని, ఒంగోలు పాలకు మరియు అనంతపురం పండ్లకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల ఉత్పత్తుల ప్రత్యేకతను ప్రస్తావిస్తూ, వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అభివృద్ధి దిశగా అమరావతి : రాజధాని అమరావతి అభివృద్ధిపై కూడా సీఎం కీలక ప్రకటనలు చేశారు. రెండు మూడు సంవత్సరాల్లో అమరావతికి స్పష్టమైన రూపురేఖలు కనిపిస్తాయని తెలిపారు. రాజధాని రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నామని, ఇన్నర్ మరియు అవుటర్ రింగ్ రోడ్లతో కనెక్టివిటీ మరింత పెరుగుతుందని వివరించారు.
రాయలసీమ మార్పు – హార్టికల్చర్ హబ్ లక్ష్యం : రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం పేర్కొన్నారు. గతంలో పశువులకు నీరు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. పశుగ్రాసం, నీటిని రైళ్ల ద్వారా తరలించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. 2014-19 మధ్యకాలంలో కూడా రైన్ గన్స్ ద్వారా పంటలను కాపాడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పారు.
హంద్రీ-నీవా ప్రాజెక్టును సీరియస్‌గా తీసుకుని నీటి సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ నాణ్యమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని, ముఖ్యంగా దానిమ్మకు మంచి మార్కెట్ ఉందని తెలిపారు. హార్టికల్చర్ హబ్ అభివృద్ధికి రూ.30 వేల కోట్లు కేటాయించడం సంతోషకరమని అన్నారు.
నేతలతో మానవీయ సంబంధాలు అవసరం : పార్టీ నేతలతో మానవీయ సంబంధాలు, మోటివేషన్, బాధ్యతాభావం సమన్వయంగా ఉండాలని సీఎం సూచించారు. భయం – భక్తి అనే భావన క్రమశిక్షణలో భాగమని వ్యాఖ్యానించారు. లోకేష్ తన పని తాను చేసుకుంటున్నారని, తాను తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం, ప్రజల నమ్మకం నిలబెట్టుకోవడం ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడితేనే ప్రభుత్వం మరింత బలపడుతుందని, లేదంటే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని “స్వీట్ వార్నింగ్” ఇచ్చారు.