దుండిగల్ మున్సిపాలిటీలో.. అధికారుల చేతివాటం బట్టబయలు..?
దొమ్మర పోచంపల్లి సర్వే నెం.158 పట్టా భూమి పత్రాలకు 4 అసెస్మెంట్‌లు..
అవే ఇంటి నెంబర్‌లతో సర్వే నెం.156 ప్రభుత్వ భూమి ఆక్రమణ..
సర్వే నెం.156లో ఇంటి నెంబర్‌లు "డి యాక్టీవేట్" చేశామని బుకాయింపు..
మూడేళ్ళుగా ప్రభుత్వ ఖాళీ స్థలాలకు ఇంటి పన్ను చెల్లింపులు..
డి.పోచంపల్లి గ్రామ పరిధిలోని "ఈర్లకుంట" లేక్ఐడి నెం.2831లో 5 ఇంటి నెంబర్‌లు..
ఇండ్లు లేకపోయినా ఇంటి నెంబర్‌లకు బిల్ కలెక్టర్ అసెస్మెంట్..
*సర్వే నెం.158లో ప్లాట్ నెంబర్ 85 పేరుతో ఓ వ్యక్తికి నోటరీ పత్రాలకి అసెస్మెంట్..
నోటరీతో మున్సిపల్ ఇంటి నెంబర్.. ఇంటి నెంబర్‌తో మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్
అధికారులకు తెలియకుండా.. బిల్‌కలెక్టర్‌లకి సాధ్యమేనా..?
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, మే 12:
దుండిగల్ మున్సిపాలిటీపై మేడ్చల్ జిల్లా లోకల్‌బాడీ అదనపు కలెక్టర్.. పర్యవేక్షణా లోపం స్పష్టంగా కనిపిస్తుంది.. "తిలాపాపం తలాపిడికెడు" అన్న చందంగా ఎవరి వాటా వారు పుచ్చుకుని చెరువుల్లో, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా అసెస్మెంట్‌లు చేస్తున్నారని తేటతెల్లం అయింది.. దొమ్మర పోచంపల్లి గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిలో కొన్ని, చెరువులో మరికొన్ని వక్రమార్గంలో ఇంటి నెంబర్‌లను కేటయించిన విషయం తెలిసినప్పటికీ..! మున్సిపల్ ఆర్వో, కమిషనర్‌కి సమాచారం అందజేసినా రద్దు చేయకుండా కాలయాపన చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.. మరోవైపు పై అధికారులకి తెలియకుండా, స్థానిక బిల్ కలెక్టర్‌కి ఇదంతా సాధ్యమేనా..? దుండిగల్ మున్సిపాలిటీలో ఇప్పటికే "టిజి-బిపాస్" చట్టాన్ని చుట్టంగా మలుచుకుని, టౌన్‌ప్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాలకు బహిరంగంగా సహకరిస్తున్న మున్సిపల్ అధికారులు.. ఒక్క దొమ్మర పోచంపల్లి గ్రామ పరిధిలోనే అక్రమంగా 10 ఇంటి నెంబర్‌లు జారీచేసిన వ్యవహారంలో ఎవరిని బాధ్యులుగా చేస్తారో చూడాలి.. సంబంధిత బిల్ కలెక్టర్‌తో ఇతర అధికారులు చేతులు కలిపి ఈ సాహసానికి ఒడికట్టారా..? లేక పై అధికారులను, బిల్ కలెక్టరే తప్పుదోవ పట్టించి గుట్టు చప్పుడు కాకుండా అసెస్మెంట్ ప్రక్రియ ముగించేశారా..? ఒకే వ్యక్తి ప్రమేయం, సిఫార్సులతో ఈ 10 ఇంటి నెంబర్‌ల కేటాయింపులో ఇంకా ఎవరైనా సిఫార్సులు చేశారా..? బీఆర్ఎస్ హయాంలోనే, మూడేళ్ళ క్రితం ఈ ఇంటి నెంబర్‌ల బాగోతంలో ఓ బీఆర్ఎస్ నేత అండతో, కాంగ్రెస్ నేతకు, మున్సిపల్ అధికారులు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.. సంబంధిత కాంగ్రెస్ నేత ప్రస్తుతం, ఇంటి నెంబర్‌ల రద్దుకు అడ్డు పడుతున్నట్లు అనధికారిక సమాచారం..
ఈర్లకుంట ఎఫ్‌టిఎల్ బఫర్‌లో ఇంటి నెంబర్‌లు..
దుండిగల్ గండిమైసమ్మ మండలం దొమ్మర పోచంపల్లి గ్రామ పరిధిలోని "లేక్ఐడి నెం.2831 ఈర్లకుంట ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్‌లో ఓ కాంగ్రెస్ నేత గతంలో వెంచర్ నిర్మాణం చేపట్టాడు.. చెరువు ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్‌లోనూ ప్లాట్‌లు విభజించారు.. చెరువు బఫర్ జోన్‌లో ఓ మార్వాడీకి విక్రయించిన ప్లాట్‌లో భారీ అక్రమ షెడ్డును నిర్మించగా మున్సిపల్ అధికారులను మేనేజ్ చేసి,స్థానిక బిల్ కలెక్టర్ సంబంధిత షెడ్డుతో పాటు, మరికొన్ని ఖాళీ ప్లాట్లకు ఇంటి నెంబర్‌లు జారీ చేశారు.. ఈ వ్యవహారంలో వెంచర్ నిర్వాహకుల ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో..! గదుల నిర్మాణం లేకుండానే, ప్రీకాస్ట్ ఫెన్సింగ్ వేసిన, చెరువు లోని ప్లాట్‌లకి అసెస్మెంట్ పూర్తి చేశారు..
సర్వే నెం.156 ప్రభుత్వ భూమిలోనూ ఇంటి నెంబర్‌లు..
ఇందుకలడు, అందులేడని, సందేహం వలదు, ఎందందు వెతికినా, అందందు సంబంధిత అధికారుల ప్రమేయం ఉంటుందని..! దుండిగల్ మున్సిపల్ అధికారులు సర్కారు భూమిలోనూ ఇంటి నెంబర్‌లు జారీచేసి తమ సత్తా చాటుకున్నారు.. దుండిగల్ మండలం దొమ్మర పోచంపల్లి సర్వే నెం.158 పట్టా భూమితో పాటు సర్వే నెం.156 ప్రభుత్వ అసైన్డ్ భూమిని కలిపి కొన్నేండ్ల క్రితం వెంచర్ నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.. డాక్యుమెంట్‌లు మొత్తం సర్వే నెం.158 పట్టా భూమిపైనే రిజిస్ట్రేషన్‌లు చేశారు.. కానీ 156 ప్రభుత్వ భూమిలోనే మిగతావారికి ప్లాట్‌లు చూపించారు.. అప్పట్లో తెలియక కొనుగోలు చేసినవారు ఇప్పటికీ పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నప్పటికీ..! 158లో ఖాళీస్థలం లేక..! పలుకుబడితో ప్రభుత్వ భూమి 156లో తిష్ట వేశారు..
ఇంటి నెంబర్‌లు ఇచ్చిన 4 అక్రమ నిర్మాణాలు కూల్చివేత..
అయితే పట్టాభూమి పత్రాలతో ప్రభుత్వ భూమిలో నిర్మించిన నాలుగు అక్రమ కట్టడాలకు ఇంటి నెంబర్‌లు జారీచేసిన విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు..! 2023 ఏప్రిల్ నెలలో అప్పటి తహశీల్దార్ పద్మప్రియ ఆదేశాలతో 4 అక్రమ కట్టడాలను 2023 ఏప్రిల్ 9న రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు.. ఇంటి నెంబర్‌లను కూడా రద్దుచేయాలని, మున్సిపల్ అధికారులకు తహశీల్దార్ సూచించినట్లు సమాచారం.. వెంటనే "డీ యాక్టీవేట్" చేశామని మున్సిపల్ ఆర్వో చెప్పినప్పటికీ..! అవే నాలుగు ఇంటి నెంబర్‌లకు మూడేళ్ళుగా ఇంటి పన్ను చెల్లింపులు యధావిధిగా కొనసాగటంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
సర్వే నెం.158 పట్టాభూమి వెంచర్‌లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లే ఉన్నప్పటికీ..! ప్లాట్ నెంబర్ 85 పేరుతో రెండేళ్ళ క్రితం ఓ వ్యక్తి పేరుమీద నోటరీ డాక్యుమెంట్ చేసి మున్సిపల్‌ను సంప్రదించి, ఇంటి నెంబర్ పొందడం, ఆ ఇంటి నెంబర్‌తో మరో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లు చేయడం స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..బయటపడిన అక్రమ అసెస్మెంట్‌లు ఈ 10 మాత్రమేనా..? బయటకు రానివి ఇంకెన్ని ఉన్నాయోనని స్థానికులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు..