డిజిపిఎస్ సర్వే వివరాలు సేకరించకుండా జర్నలిస్టులను అడ్డగింత..
జర్నలిస్టులపై వెంకట ప్రణీత్ డెవలపర్స్ దాష్టీకం..
గాగిల్లాపూర్ ఉస్మాన్‌కుంట కబ్జాపై హైడ్రా ఆదేశాలతో శనివారం డిజిపిఎస్ సర్వే..
సర్వే వివరాలు బయటికి పొక్కకుండా రియల్ సంస్థ దౌర్జన్యం..?
అధికారులను మేనేజ్ చేసేందుకే మీడియాను అనుమతించలేదా..?
ప్రభుత్వ స్థలంలోకి జర్నలిస్టులు రాకుండా అడ్డుకోవడంపై విస్మయం..
కబ్జాతో 4 ఎకరాలకి కుంచించుకుపోయిన ఉస్మాన్‌కుంట..?
సర్వే నెం.214 ప్రభుత్వ భూమిని కూడా రియల్ సంస్థ ఆక్రమించిందన్న ఆరోపణలు..!
వెంచర్‌ల మధ్యలో చెరువులు ఉంటే..! ఇరిగేషన్ చట్టాలు వర్తించవా..?
చెరువును చూడాలనే స్థానికుల ఆకాంక్షను, ప్రజల సందర్శనని నియంత్రింస్తారా..?
ఇదేం తీరు..? ఉస్మాన్‌కుంటలోకి ప్రవేశం లేదంటూ అడ్డుకునే హక్కు ఎక్కడిది..?
జర్నలిస్టులను లోనికి పంపించకుండా, గేట్లు మూసేసిన వెంకట ప్రణీత్ డెవలపర్స్..
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఆగష్టు 30:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలోని ఉస్మాన్‌కుంట 2022లో నిండుకుండలా ఉండేది.. అప్పటికి వెంకట ప్రణీత్ విల్లాల నిర్మాణం కూడా ప్రారంభించక ముందే, చెరువులో నీరు విస్తరించి ఉన్న ఫైల్‌ఫోటోలు (పాతచిత్రాలు) నేటి "పెన్ పవర్" దినపత్రికలో ప్రత్యేకంగా చూడవచ్చు.. నాటి ఉస్మాన్‌కుంట చెరువు విస్తీర్ణం ఏ ప్రాతిపదికన కుదించబడిందో కానీ..! చెరువును చాలా వరకు ఆక్రమించారని స్పష్టమవుతుంది.. ఇరిగేషన్ యాక్ట్" అనేది భారతదేశంలోని నీటిపారుదల నిర్మాణాలకు, నిర్వహణకు సంబంధించిన చట్టం, దీనిలో తెలంగాణకు సంబంధించిన "తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్, 1357 ఎఫ్". ఈ చట్టం నీటిపారుదల కాలువలు, ట్యాంకులు, ఇతర నీటిపారుదల పనుల నిర్మాణాన్ని మరియు నిర్వహణను నియంత్రిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల (నీటి కోర్సుల నిర్మాణం మరియు నిర్వహణ) చట్టం, 1965 కూడా నీటిపారుదల పనుల ఆయకట్టులో నీటి పారుదల మరియు నిర్వహణ కోసం ఈ చట్టాన్ని అమలు చేసింది.. ఈ చెరువులు, ఫారెస్ట్ భూముల పరిరక్షణపై, "నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ " కోర్టులు ఉన్న విషయం అందరికి తెలిసిందే..
చెరువును చూసేందుకు.. సందర్శకులపై ఆంక్షలేంటి..?
ఉస్మాన్‌కుంట ప్రైవేటు ఆస్తులు కాదు.. ప్రభుత్వ ఆస్తులు అన్న విషయం, వెంచర్ నిర్వాహకులు గమనించాలి.. గాగిల్లాపూర్ గ్రామ పరిధిలోని ఉస్మాన్‌కుంటను చూడాలన్న స్థానికుల ఆకాంక్షాను, సందర్శకులను అడ్డుకునే హక్కు ఎవరిచ్చారు..? సర్వే వ్యవహారం ఏమైనా రహస్యమా..? లోనికి ప్రవేశం లేదంటూ, మీడియాను వెంకట ప్రణీత్ డెవలపర్స్ అడ్డుకోవడంపై విమర్శలు.. హైడ్రా ఎస్పీ అశోక్ ఆదేశానుసారం శనివారం ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు డీజీపీఎస్ సర్వే నిర్వహించింది. అయితే సర్వే వివరాలు కవర్ చేసేందుకు జర్నలిస్టులు ప్రయత్నం చేయగా చెరువును ఆక్రమించిన వెంకట ప్రణీత్ డెవలపర్స్ లోనికి రాకుండా అడ్డుకుంది. దీంతో డీజీపీఎస్ సర్వే జరుగుతున్న విధానం జర్నలిస్టులు ప్రజలకు చేరవేయకుండా అడ్డుకోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది.. ఉస్మాన్‌కుంటపై భాగం, కింది భాగంలోని సర్వే నెంబర్‌లలో దాదాపు 70 ఎకరాల భూములను కొనుగోళ్లు చేసి అందులో వెంకట ప్రణీత్ డెవలపర్స్ దాదాపు 700 విల్లాలను నిర్మిస్తుంది. ఈ క్రమంలో సర్వే నెంబర్ 203లో ఉస్మాన్‌కుంట చెరువు శిఖం, బఫర్ జోన్ కలుపుకొని 10 ఎకరాలు ఉండగా, వెంకట ప్రణీత్ డెవలపర్స్ కుట్రకు దాదాపు 4 ఎకరాలకు కుంచించుకు పోయింది..? ఇటు బఫర్ జోన్ కూడా ఆక్రమించిందని ఆరోపణలు ఉన్నాయి.. ఉస్మాన్‌కుంట నాలాలు, సర్వే నెంబర్ 204లో ఉన్న సీలింగ్ భూమి, 214 లో ఉన్న ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించిదన్న ఆరోపణలు ఉన్నాయి..
ఏదిఏమైనప్పటికీ ఉస్మాన్‌కుంట చెరువు కబ్జాపై తమ కుట్ర కోణం ఎక్కడ బయట పడుతుందేమోనని ఆందోళన చెందిన వెంకట ప్రణీత్ డెవలపర్స్ ఉస్మాన్‌కుంట వద్ద జరుగుతున్న డీజీపీఎస్ సర్వే విధానం తెలుసుకోకుండా మీడియాను అడ్డుకుంది..వాస్తవానికి ప్రైవేట్ సర్వే నెంబర్లో చెరువులు, కుంటలు నాలాలు, కట్టు కాలువలు ఉన్నప్పటికీ ఇరిగేషన్ చట్టం ప్రకారం అవి ప్రభుత్వానికి చెందుతాయి. ఈ లెక్కన ఉస్మాన్‌కుంట ప్రభుత్వానిదే కానీ..! వెంకట ప్రణీత్ డెవలపర్స్‌ది కాదని గమనించాలి..ప్రభుత్వానిదైతే ఆది ప్రజా ఆస్తిగానే పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి ఉస్మాన్‌కుంట వద్దకు అన్ని వర్గాల ప్రజలకు వెళ్ళే హక్కు ఉందని ఈ మేరకు హైడ్రాతో పాటు ఇరిగేషన్ రెవెన్యూ శాఖలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు..