గంగవరం, పెన్ పవర్ ,జూలై 1:
ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షిస్తూ, ఉపాధ్యాయుల హక్కులను కాపాడుతూ ముందుకు వెళ్లాలని యూటిఎఫ్ అల్లూరి జిల్లా కార్యదర్శి కే కృష్ణ పిలుపునిచ్చారు. గంగవరం వై జంక్షన్ వద్ద మండల అధ్యక్షులు సిహెచ్. రాంబాబు దొర, ప్రధాన కార్యదర్శి సిహెచ్. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభ్యత్వ నమోదు కేంద్రాన్ని మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటిఎఫ్) అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. కృష్ణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కె. కృష్ణ మాట్లాడుతూ, “గత 50 ఏళ్లుగా ఉపాధ్యాయ సంక్షేమం కోసం యూటిఎఫ్ నిరంతరం కృషి చేస్తోంది. 1991 తరువాత ప్రారంభమైన ప్రపంచీకరణ వల్ల విద్యారంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వాలు విద్యను అందించాల్సిన బాధ్యత నుంచి తప్పుకుంటూ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వేగం పెంచుతున్నాయి. దీనివల్ల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కోల్పోతున్నారు” అని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బోధనేతర పనులు పెరిగి పిల్లల సంఖ్య తగ్గిపోతోందని అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 49 శాతం విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, 51 శాతం ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారని వివరించారు.“యూటిఎఫ్ ఉపాధ్యాయుల హక్కులకోసం మాత్రమే కాదు, ప్రభుత్వ బడులను కాపాడటానికే తల్లిదండ్రులతో కలిసి పోరాడుతుందన్నారు. ఈ నిరంతర పోరాటాల వలన ప్రభుత్వ సంస్కరణల వేగం కొంతవరకు తగ్గింది. గత ప్రభుత్వం ఆరు పాఠశాలను ప్రవేశపెడితే, ఈ ప్రభుత్వం తొమ్మిది పాఠశాలను ప్రవేశపెట్టింది. మోడల్ ప్రైమరీ పాఠశాలలు కొంతమేరకు మెరుగ్గా ఉన్నప్పటికీ మిగతా పాఠశాలల పరిస్థితి ఆందోళనకరం” అని అన్నారు.ఇటీవల ఉపాధ్యాయ బదిలీలలో అన్ని సంఘాలతో ఐక్యవేదిక ఏర్పడి ఎస్ జి టి లకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేయగలిగామని గుర్తుచేశారు. అలాగే, యూటిఎఫ్ ఉద్యమం ఫలితంగా పిఎఫ్, ఎపిజిఎల్ఐ, మెడికల్ రీయింబర్స్‌మెంట్, సిపిఎస్ కాంట్రిబ్యూషన్ బకాయిలుగా సుమారు 11 వేల కోట్ల రూపాయలు సాధించామని తెలిపారు. ఇంకా సరెండర్ లీవ్స్, పిఆర్సి, డిఏ అరియర్లు సాధించుకోవాల్సి ఉందన్నారు.
12వ పి ఆర్ సి కమిషనర్ నియామకానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ బడులను కాపాడుతూ ప్రతి విద్యార్థికి నాలుగు అక్షరాలు, నైతిక విలువలు నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందన్నారు . తల్లిదండ్రులతో కలిసి విద్యారంగాన్ని రక్షించే పోరాటం కొనసాగించాలని, యూటిఎఫ్‌ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ
కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కె. రఘుబాబు దొర, మహిళా అధ్యక్షురాలు ఎల్. రుక్మిణి దేవి, పత్రిక బాధ్యులు అన్నం చిన్నారెడ్డి, జిల్లా కౌన్సిలర్ వెంకన్న దొర, లలిత, లావణ్య, డి. చెన్నారెడ్డి, ఎం. ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.