కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్

Former Union Minister Birender Singh joined Congress

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే ప్రేమ లత మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు దశాబ్దం తర్వాత ఆయన తిరిగి సొంత గూటికి చేరారు. బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్ బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన నెలరోజుల తర్వాత తండ్రి కూడా అదే పార్టీలో చేరిపోవడం విశేషం. రైతు నాయకుడు సర్ చోటూ రామ్ మనవడైన బీరేందర్ సింగ్(78) 2014లో కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరారు.


ప్రధాని నరేంద్ర మోడీ తొలి ప్రభుత్వంలో కేంద్ర ఉక్కు మంత్రిగా ఆయన పనిచేశారు. ఆ శాఖతోపాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మంచి నీరు, పారిశుద్ధ శాఖలను కూడా నిర్వహించారు. కాంగ్రెస్‌లో తిరిగిరాకను పురస్కరించుకుని బీరేందర్ సింగ్ ఆనందం వ్యక్తం చేస్తూ ఇది కేవలం ఘర్ వాపసీ మాత్రమే కాక విచార్ వాపసీ కూడానని చెప్పారు. బీరేందర్ సింగ్, ప్రేమ లత పునరాగమనాన్ని స్వాగతించిన కాంగ్రెస్ నాయకుడు ముకుల్ వాస్నిక్ వారి రాకతో హర్యానాలో కాంగ్రెస్ మరింత బలపడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడుతుందని ఆకాంక్షించారు.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా మాట్లాడుతూ బీరేందర్ సింగ్ తన అన్న లాంటి వారని, ఆయన కాంగ్రెస్‌లోకి తిరిగి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఐక్యతను ప్రదర్శించడం ద్వారా మన బలాన్ని పెంచుకోవలసిన అవసరం ఉందని, అప్పుడే మనం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలమని ఆయన అన్నారు. ఐఎసిసి ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జీవాలా మాట్లాడుతూ ఇది తనకు ఎంతో భావోద్వేగ క్షణాలని చెప్పారు. బీరేందర్ సింగ్‌కు స్వాగతం చెప్పడం చెప్పడానికి వచ్చిన వారిలో కాంగ్రెస్ నాయకుడు సెల్జా కుమారి, ఉదయ్ భాన్, కిరన్ చౌదరి తదితరులు ఉన్నారు.

About The Author: Admin