నర్సీపట్నం, పెన్ పవర్ :
మండలంలోని నీలంపేట గ్రామంలో ఆదివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామానికి చేరుకున్న స్పీకర్ కు గ్రామ మహిళలు హారతులతో, యువత బాణాసంచా మోతలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత, రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే తనను పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, అతి చిన్న వయసులోనే మంత్రిగా అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని కొనియాడారు. కేజీ బియ్యం రెండు రూపాయల పథకం, ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు, రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన స్మరించుకున్నారు. తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపన ద్వారా మహిళా విద్యకు ఆయన పెద్దపీట వేశారని తెలిపారు.
అనంతరం గ్రామ అభివృద్ధిపై స్పందిస్తూ.. గత ఏడాది నీలంపేట అభివృద్ధి కోసం 41 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేశానని, అందులో రోడ్ల పనులు పూర్తయ్యాయని, స్మశాన వాటిక పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఈ ఏడాది మరో 6 రోడ్ల నిర్మాణానికి 30 లక్షల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. త్వరలోనే డిగ్రీ కాలేజీ రోడ్డు నుండి గ్రామ వరకు మిగిలిన రోడ్డు పనులను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నర్సీపట్నం పట్టణ టిడిపి పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్ చింతకాయల రాజేష్, టిడిపి నాయకులు బోళెం శ్రీనివాస్, వెంకునాయుడు, జెడ్ పిటిసి రమణమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకట రమణ, శ్రీ రంగస్వామి, బోళెం రాంప్రసాద్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరియు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.