దేవీపట్నం,పెన్ పవర్,జూలై3:
గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామంలో టాకర పద్మ, టాకర దుర్గాదేవి అనే మహిళలు నివసిస్తున్న ఇళ్లపై పెద్ద చింతచెట్టు అకస్మాత్తుగా పడిపోవడంతో రెండు ఇళ్లు పూర్తిగా కుప్పకూలిపోయాయి.ఇంటిపైనే కాకుండా,శివారులో ఉన్న చిన్న షాపుపై కూడా చెట్టు విరిగిపడింది.ఈ ఘటనలో ఇళ్లతో పాటు ఇంటి సామాగ్రి కూడా పూర్తిగా ధ్వంసమైంది.చింతచెట్టు వృక్షం పురాతనంగా ఉండటం,భారీ వర్షాలకు నేల తడిగా మారిపోవడం వల్ల రాత్రి సమయంలో ఒక్కసారిగా కూలిపోయిందని స్థానికులు తెలిపారు.ఇళ్లను కోల్పోయిన బాధితులు తాము దారుణమైన ఆస్తినష్టం పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి,తమకు నష్టపరిహారం చెల్లించి,నివాసం కోసం తగిన సహాయం చేయాలని కోరుతున్నారు.విషయాన్ని గుర్తించి సంబంధిత అధికారులు పరిశీలించి బాధిత కుటుంబాలకు వెంటనే ఆర్థిక, నివాస సహాయం అందించాలని గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ప్రస్తుతం బాధిత కుటుంబాలు పక్కింటి వద్ద తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నాయి. అధికారుల పర్యటన కోసం వారు ఎదురుచూస్తున్నారు.