గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఆగస్టు 18: గూడెం కొత్తవీధి మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో గ్రామీణ ప్రాంతాలలో రహదారులు తడిసి ముద్దవుతున్నాయి. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా అడ్డంకులుఏర్పడుతున్నాయి.వాగులు,వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో,ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాడేరు నియోజకవర్గ వైసిపి కోశాధికారి దామనాపల్లి సర్పంచ్ కుందేరి రామకృష్ణ సూచించారు.వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రకారం, రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, అత్యవసరమైతే తప్ప ఇంటి వెలుపలకి రావద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.ప్రభుత్వం, స్థానిక అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. అంటువ్యాధుల ప్రబలకుండా ముందుకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సిబ్బంది, సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాలువలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని వివరించారు. పంట పొలాలను పరిరక్షించుకోవాలని తెలిపారు.