👉తుఫాన్ హెచ్చరిక-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
👉ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బోయిన కుమారి సూచన
గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్ 26:రాబోయే మూడు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ బోయిన కుమారి సూచించారు.వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా 28వ తేదీ అర్ధరాత్రి లేదా 29వ తెల్లవారుజామున తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని వెల్లడించిన ఆమె, ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మట్టి ఇళ్లు లేదా పూరి గుడిసెల్లో నివసించే వారు సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, వాగులు, చెరువులు, చెట్లు,తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి వెళ్లరాదని ఆమె స్పష్టం చేశారు.ఏదైనా సమస్య తలెత్తిన పక్షంలో తక్షణమే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని, ప్రజల ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా అధికారులు నిరంతరం ప్రజలతో సంబంధం ఉంచాలని ఎంపీపీ బోయిన కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.