స్టాఫ్ రిపోర్టర్ /పాడేరు,/ గూడెం కొత్త వీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 11:గిరిజన హక్కుల పరిరక్షణకు కీలకంగా నిలుస్తున్న పీసా చట్టం (PESA Act) గిరిజనుల తలరాతను మార్చిందని, ఇది వారికొక వరంగా మారిందని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు రమిత్ మౌర్య అన్నారు. గురువారం పాడేరు ఐటీడీఏ పరిధిలోని గొందూరు, తడిగిరి పంచాయతీలను సందర్శించిన ఆయన, గ్రామస్థులు, పీసా కమిటీ సభ్యులు, మహిళలతో సమావేశమై పీసా చట్ట ప్రాముఖ్యతను వివరించారు.పీసా చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలన బలోపేతం, అధికార వికేంద్రీకరణ, వనరులపై గిరిజనుల నియంత్రణ, సంస్కృతి పరిరక్షణ, మత్తు పదార్థాల నియంత్రణ, భూముల కబ్జా నివారణ వంటి అంశాలు సాధ్యమవుతున్నాయని ఆయన తెలిపారు. గిరిజనుల సంప్రదాయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించిందన్నారు.తడిగిరి గ్రామం మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించి ఆదర్శ గ్రామంగా నిలిచిందని కొనియాడారు. గ్రామస్థులను అభినందిస్తూ, ఇలాంటి ప్రయత్నాలు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా తడిగిరి గ్రామస్థులు, ఏజెన్సీలో సాగవుతున్న ఆర్గానిక్ ఉత్పత్తుల నిల్వ కోసం కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రామ సభలను అర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజాపాలనను మరింత బలోపేతం చేయాలని రమిత్ మౌర్య హితవు పలికారు.ఈ సమావేశానికి డివిజనల్ పంచాయతీ అధికారి పి.ఎస్. కుమార్ అధ్యక్షత వహించగా, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి చంద్రశేఖర్, పాడేరు మరియు హుకుంపేట ఎంపీడీఓ లు తేజ రతన్, సన్యాసిరావు, గొందూరు సర్పంచ్ రాంబాబు, తడిగిరి సర్పంచ్ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.