గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 18:గత రెండు రోజులుగా అల్పపీడనం ప్రభావంతో గిరిజన ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల పేసా అధ్యక్షులు కొర్ర బలరాం తెలిపారు. సోమవారం మండల పేసా ప్రధాన కార్యదర్శి మాదిరి చంటిబాబుతో కలిసి ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, వచ్చే రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వర్షాల ప్రభావంతో వాగులు పొంగిపొర్లి, కొన్ని బ్రిడ్జులు మరియు కల్వర్టులు కొట్టుకుపోయాయని, దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.అత్యవసర ప్రయాణాలు తప్ప మరెక్కడికీ వెళ్లకుండా ఉండాలని, వెళ్లాల్సిన పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. అలాగే అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. తుఫాన్ కారణంగా అత్యవసర పరిస్థితిలో ప్రజలను ఆదుకోవడానికి పేసా సభ్యులు సంసిద్ధం ఉండాలని పిలుపునిచ్చారు.