స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జనవరి 18: రైతు సంక్షేమమే ధ్యేయంగా పాడేరు డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో (పీఏసీఎస్) జిల్లా కో-ఆపరేటివ్ సహకార బ్యాంకు (డీసీసీబీ) సమీక్ష సమావేశం సోమవారం (జనవరి 19) పాడేరు కేంద్రంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ జానపద కళలు & సృజనాత్మకత అకాడమీ చైర్మన్, జనసేన పార్టీ పాడేరు ఇంచార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య వెల్లడించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీఎస్ సభ్యులు కోన తాతారావు హాజరుకానున్నారని తెలిపారు.రైతులకు అందించబోయే రుణాలు, ఎరువులు, విత్తనాలు, వివిధ వ్యవసాయ పనిముట్ల సరఫరా అంశాలపై ఈ సమీక్షలో విస్తృతంగా చర్చించనున్నట్లు చెప్పారు.డీసీసీబీ ప్రస్తుతం రూ.1000 కోట్ల డిపాజిట్లు, రూ.1600 కోట్ల రుణాలతో మొత్తం రూ.2600 కోట్ల వ్యాపారం నిర్వహిస్తున్న నేపథ్యంలో రైతులకు మరింతగా ఏ విధంగా సహకారం అందించవచ్చో, సహకార సంఘాలను రైతులు ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవాలో పీఏసీఎస్ చైర్మన్లు, అధికారులు, సభ్యులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో అవసరమైన రుణాల కోసం డిపాజిట్ల సేకరణ, వ్యవసాయంలో చేపట్టాల్సిన ఆధునిక పద్ధతులపై కూడా ఈ సమావేశంలో వివరించనున్నారని గంగులయ్య తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో డీసీసీబీలను ఓటు బ్యాంకుగా మార్చడంతో రైతులకు ఆశించిన ప్రయోజనం దక్కలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మార్పుల వల్ల ప్రజలకు కలిగే లాభాలపై కూడా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి రుణాలు పొందడంలో ముఖ్యంగా గిరిజన ప్రాంత రైతులు వెనుకబడి ఉన్నారని, రుణాలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. భూములపై రుణాలు, వ్యవసాయేతర అవసరాలకు రూ.10 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు.తమలపాకు తోటలకు ప్రస్తుతం ఎకరానికి లక్ష రూపాయల వరకు రుణం ఇస్తుండగా, దాన్ని రూ.3 లక్షల వరకు పెంచే ఆలోచన ఉందని డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు గతంలో వెల్లడించిన విషయాన్ని గంగులయ్య గుర్తు చేశారు. కాఫీ, మిరియాలు, తమలపాకు తదితర పంటలపై రుణాలు పొందే విధానంపై ఈ సమీక్ష ద్వారా స్పష్టత లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.