గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్ 27:రాబోయే మూడు రోజులపాటు తుఫాన్ ప్రభావం కారణంగా ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్ పిలుపునిచ్చారు.మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తుఫాన్ దృష్ట్యా రెవెన్యూ, ఆరోగ్య మరియు పోలీస్ శాఖలు మండలంలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎక్కడైనా చెట్లు కూలడం, విద్యుత్ స్తంభాలు విరగడం, కొండచరియలు జారిపడడం వంటి ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.ప్రజలు సురక్షిత గృహాలలోనే ఉండాలి, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. తుఫాన్ సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీనమైన గోడల వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. మండలంలో అంబులెన్స్, చెట్లను తొలగించేందుకు అవసరమైన కట్టర్లు మరియు అత్యవసర సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. “ఈ తుఫాన్‌ను ప్రజలు తేలికగా తీసుకోవద్దు, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలి” అని ఎస్సై సురేష్ విజ్ఞప్తి చేశారు.