పులివెందుల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ:తీవ్రంగా స్పందించిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు

స్టాప్ రిపోర్టర్,పాడేరు,/గూడెం కొత్తవీధి,ఆగస్టు 14: పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు మండిపడ్డారు.ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు.2024 సాధారణ ఎన్నికల్లో నాలుగు పార్టీలు కలిసిన కూటమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 65 వేల మెజారిటీతో ఓడించిందని గుర్తు చేస్తూ, అదే నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ గెలిచిందని చెప్పడం దేశంలో ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేదన్నారు. “ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన విధంగా ఎన్నికలు నిర్వహించారు,” అని విమర్శించారు.

👉🏻దౌర్జన్యాలు – దొంగ ఓట్లు – పోలీసుల మద్దతు

ఉప ఎన్నికల సమయంలో పోలీసులను అడ్డంపెట్టి వైఎస్సార్సీపీ ఏజెంట్లపై గుండాలను దించి దాడులు జరిగాయని, దౌర్జన్యానికి పాల్పడి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. “ఈ పరిస్థితుల్లో టీడీపీ గెలిచిందని సంబరాలు చేసుకోవడం చంద్రబాబుకు సిగ్గు కలిగించే విషయం,” అని అన్నారు.

👉🏻టీడీపీకి సవాల్ విసిరిన విశ్వేశ్వరరాజు

“మీకు ధైర్యం ఉంటే ఈ ఉప ఎన్నికలను రద్దు చేసి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి. మీ పార్టీ గెలిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. మీరు ఓడిపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు,” అని శాసనసభలో ప్రకటన చేయాలంటూ సవాల్ విసిరారు.

👉🏻ఎన్నికల కమిషన్ పై మండిపాటు

ఈ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం వెనుకేసుకుని పని చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న కమిషన్ అంతగా దిగజారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా ఈ ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.

👉🏻ఉప ఎన్నికలను రద్దు చేయాలి

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను వెంటనే రద్దు చేసి, ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలని మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇది అత్యవసరమని స్పష్టం చేశారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.