వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరి, ఆన్లైన్లో అనుమతులు: జీకే వీధి సిఐ వరప్రసాద్

IMG-20250821-WA0995 గూడెం కొత్తవీధి,పెన్ పవర్ ఆగస్టు 21:వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు సంబంధించి ఈసారి ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని జీకే వీధి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ తెలిపారు. వినాయక మండపాల అనుమతుల కోసం https://ganeshutsav.net/ అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

దరఖాస్తు చేసిన అనంతరం, సంబంధిత పోలీస్ అధికారులు మండప స్థలాన్ని పరిశీలించి, క్యూఆర్ కోడ్ తో కూడిన ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం)*ను జారీ చేస్తారని వివరించారు. మండపాలను రోడ్డు మధ్యలో కాకుండా, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా, రోడ్ల పక్కన ఏర్పాటు చేయాలని సూచించారు.

మండపాల వద్ద 24 గంటలు అందుబాటులో ఉండే వాలంటీర్లను నియమించాలని,అగ్ని ప్రమాదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సమస్యాత్మక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఎన్వోసీ మంజూరుకు పోలీస్ శాఖ ఎటువంటి రుసుములు వసూలు చేయదు అని స్పష్టం చేశారు. వినాయక చవితిని ఇతర మతస్తులకు ఇబ్బంది కలగకుండా,సమన్వయంతో జరుపుకోవాలని, మండపాల నిర్వహణలో కమిటీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వినాయక ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడం నిషేధించబడిందని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.