లెటరైట్ తవ్వకాలకు ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా :మైనింగ్ ను అడ్డుకుంటామన్న ప్రజాసంఘాలు
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మే 3: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం పెదవలస పంచాయతీ డోకులూరు గ్రామంలో లెట రైట్ తవ్వకాల కోసం ఏర్పాటుచేసిన ప్రజాభిప్రాయ సేకరణ బంద్ కారణంగా వాయిదా చేసినట్లు తెలిసింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కొరకు మండలంలో ఉన్న పేసా కమిటీ మండల సభ్యులు, వివిధ గిరిజన ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పేసా కమిటీ అధ్యక్షులు కోర్ర బలరాం మాట్లాడుతూ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ కు రెండు నెలల క్రితం సభ నిర్వహిస్తున్నట్లు ఫోన్ ద్వారా ఇంటిమేషన్ ఇచ్చారు తప్ప రాతపూర్వకంగా ప్రథమ పౌరుడికి తెలియ చేయకపోవడం బాధాకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలకు నష్టం కలిగించే మైనింగ్ ను అడ్డుకుంటామని అన్నారు. ఆదివాసి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మొట్టడం రాజు బాబు మాట్లాడుతూ మైనింగ్ను ఈ రోజైనా రేపైనా ఏ రోజైనా అడ్డుకుంటామని దీన్ని ప్రోత్సహించేది లేదని అన్నారు. ఎంపీపీ బోయిన కుమారి మాట్లాడుతూ మైనింగ్ తవ్వకాలను ఖండిస్తున్నామని, భావితరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు తవ్వకాలను అడ్డుకోవటానికి కృషి చేయాలని అన్నారు. సిపిఎం పార్టీ నాయకులు గాలికొండ ఎంపీటీసీ అంపురంగి బుజ్జిబాబు మాట్లాడుతూ డోకులూరు గ్రామంలో మైనింగ్ తీయడం వలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, కొంతమందిని ఆశ చూపి మైనింగ్ కు అనుకూలంగా మార్చుకోవచ్చునేమో గాని దానివలన భూగర్భ జలాలు అడుగంటి పోవటం, పర్యావరణం దెబ్బతినటం, సరైన పంటలు పండక పోవటం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయని అందుకే మైనింగ్ను అడ్డుకుంటామని అన్నారు. చింతపల్లి జడ్పిటిసి పోతురాజు బాలయ్య మాట్లాడుతూ అధికారులు నామమాత్రంగా ఎవరికీ తెలియకుండా అభిప్రాయ సేకరణ చేపట్టాలనుకోవటం మంచి పద్ధతి కాదు అని, అన్ని గిరిజన సంఘాలు, ప్రజలు ప్రజాప్రతినిధులందరూ కలిసి మైనింగ్ అడ్డుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పేసా గౌరవ అధ్యక్షులు గొర్లె వీర వెంకట్, కోశాధికారి లకే రామసంద్రుడు, దేవరపల్లి సర్పంచ్ సిరి బాలా బుజ్జి బాబు, దామనపల్లి సర్పంచ్ రామకృష్ణ, స్థానిక సర్పంచ్ కృష్ణవంశీ, మండల పేసా ప్రధాన కార్యదర్శి మాదిరి చంటిబాబు, నాయకులు గడుతూరి సత్యనారాయణ, మన్యపుత్ర యువజన సంఘం అధ్యక్షులు మడపల సోమేశ్ కుమార్ వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.