చిన్నదామెర చెరువు కబ్జా..! కథ కంచికేనా..!
ఏడాదిన్నర క్రితం హడావుడి చేశారు.. ఇప్పుడు అలసత్వం వహిస్తున్నారు..
హైదరాబాద్ మహానగరం అభివృద్ధి దేవుడెరుగు..! భారీ వర్షాలు వస్తున్నాయని, వాతావరణ శాఖ సమాచారం వింటేనే నగర ప్రజలు వణికి పోతున్నారు.. మరోవైపు నగరంతో పాటు, హైదరాబాద్ శివారు ప్రాంతాల చెరువులకు సంబంధిత అధికారులే గండంగా తయారయ్యారు.. కేవలం నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువులు, కట్టుకాలువలు అంతరించి పోతున్నాయి.. దీంతో భవిష్యత్తులో ప్రజల మనుగడకే పెను ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు..మరో ఐదేళ్ళలో, పెద్దపెద్ద చెరువులు కుంటలుగా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.. రైతేరాజు..! దేశానికి వెన్నుముక రైతు..! రైతులేనిదే రాజ్యం లేదంటారు..! ఇదంతా పొగడ్తలకే పరిమితమైంది.. రేయింబవళ్ళు కష్టపడి రైతుపండించిన పంటతో దళారులు కోటిశ్వరులు అవుతున్నారు.. రైతు మాత్రం అదే ఎండిన డొక్కలు.. ఒకపూట తింటే మరోపూటకు నీళ్ళు తాగి బతకాల్సిన పరిస్థితి నేటికీ గ్రామాల్లో చూస్తున్నాం.. రైతులు అంటేనే అధికారుల్లో అదో చిన్నచూపు అంటూ విమర్శలు..!
చెరువులోకి నీళ్ళు రాకుండా గొలుసుకట్టు కాలువలు ఆక్రమించి..! చెరువు కబ్జా..!
దుండిగల్ లేక్ఐడి నెం.2811 చిన్నదామెర చేరువులో 8-20 ఎ. కబ్జాపై నిర్లక్ష్యం..!
చిన్నదామెర చెరువులో 11 అక్రమ కట్టడాలు ఉన్నట్టు నిర్ధారించి ఏడాదిన్నర..
భారీ పోలీసు బలగాలు మోహరించి.. పాక్షిక చర్యలతో మమాః అనిపించారు..
నాడు చెరువులో కళాశాల నిర్మాణం అంతా అధికారుల కనుసన్నల్లోనే..!
నేడు అదే చెరువు కబ్జాపై అధికారులు నిర్లక్ష్యంతో చర్యలకు దూరం..!
పాక్షికంగా కూల్చేసిన కళాశాల నిర్మాణం మళ్ళీ నిర్మించి, నిర్వహణకు సిద్దం..

2021లోనే "పెన్ పవర్" దినపత్రికలో చిన్నదామెర చెరువు కబ్జాపై ప్రత్యేక కథనంతో నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, అధికారులు నిర్లక్ష్యం వహించారు.. 2024 ఫిబ్రవరిలో అదే అక్రమ కట్టడాలపై హైకోర్టు ఆదేశాలతో నగరంలోని కొన్ని చెరువుల పరిశీలనలో భాగంగా..! న్యాయ నిపుణుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది హైకోర్టు.. 2024 ఫిబ్రవరి 18న "సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రవీణ్ కుమార్" తెలంగాణ రెవెన్యూ సంబంధిత ప్రభుత్వ ప్లీడర్ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో న్యాయ నిపుణుల కమిటీ బృందం, దుండిగల్ చిన్నదామెర చెరువును సందర్శించి పరిశీలించింది.. కబ్జాను గుర్తించిన బృందం సంబంధిత అధికారులను నివేదిక కోరడంతో..! 08-20 ఎకరాలు ఆక్రమించి, "ఐఏఆర్ఇ అండ్ యంఎల్ఆర్ఐటియం" కళాశాల నిర్మాణాలు చిన్నదామెర చెరువులోనే ఉన్నట్టు, నిర్ధారణకు వచ్చిని అధికారులు, కూల్చివేతలకు సిద్ధమయ్యారు..! హాస్యాస్పద విషయం ఏమిటంటే..! మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి చెరువు కబ్జాకు సహకరించిన అధికారులే..! కూల్చివేతలకు సిద్ధమై చర్యలు ప్రారంభించారు.. ఏమైందో ఏమోకానీ..! అకస్మాత్తుగా ఆ చర్యలు కూడా నిలిపేసి ఏడాదిన్నర గడిచింది.. పైగా ఆ కూల్చివేతల ఘటన ఒక పీడకళగా భావించారో ఏమో ఏడాదిన్నరగా, తదుపరి చర్యల ఊసేలేదు.. యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆర్డర్ ఉందని చెబుతున్న అధికారులు,. కూల్చేసిన భవనాన్ని మళ్ళీ ఎలా నిర్మించారు.. ప్రశ్నించడానికి బాధ్యతగల అధికారులు లేరు.. అధికారుల్లో పారదర్శకత అంతకంటే లేదు.. తెలంగాణలో రోజు రోజుకు "సిస్టమ్" అబాసుపాలు అవుతుంది.. పరాధీనం అవుతున్న ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు దిక్కుమొక్కు లేకుండా పోయింది.. చిన్నదామెర చెరువుకు, నీళ్ళు రాకుండా కట్టుకాలువలు మూసివేసి..! చెరువులో అక్రమ కట్టడాలు.. అధికారులకు తెలియకుండా సాధ్యమేనా..? 2021 లోనే ఆధారాలతో, పెన్ పవర్ దినపత్రికలో వార్తా కథనాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం శూన్యం.. చివరికి న్యాయస్థానం అక్షింతలు వేశాక 2024 ఫిబ్రవరిలో చిన్నదామెర చెరువు సందర్శనలు, కలెక్టర్ పరిశీలనలు హడావుడి చేశారు.. అంతా సద్దుమణిగింది.. కానీ కబ్జాలో ఉన్మ 8-20 ఎకరాలు కాపాడుతారా..? అమ్ముకుంటున్నారా..? అధికారం ఉందనే అహంతో ప్రజల ఆస్తులకు శఠగోపం..*

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఆగష్టు 27:
కంచే చేను మేసిన చందంగా చెరువుల పరిస్థితి తయారైంది.. అధికారులు విధుల్లో ఉండటం లేదా, అంటే అదేంకాదు..! నిత్యం నీటిపారుదల శాఖ వర్క్‌ఇన్‌స్పెక్టర్ మొదలుకొని ఏఈఈ, డీఈఈ, ఈఈ, వరకు..! ఫీల్డ్‌కు వెళ్ళేవారు ఉన్నారు.. ఆర్ఐ నుండి తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ వరకు..! ఫిర్యాదులు వెళ్తూనే ఉంటాయి..! కానీ పట్టించుకోరు.. జవాబుదారీ తనం జాడలేదు.. కారణం ముడుపులకు అలవాటుపడి, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు తిలోదకాలు పలుకుతున్నారు.. అందుకే చెరువుల్లో అక్రమ కట్టడాలను నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు, బరితెగించి, బహిరంగంగానే సహకరించడానికి కూడా వెనుకాడటం లేరు.. దుండిగల్ గండిమైసమ్మ మండలం చిన్నదామెర చెరువులో తిమింగలాలు తిష్ట వేసాయి.. చిన్నదామెర చెరువు కబ్జాకు పక్కా పథకం పన్నారు..రింగ్‌రోడ్డు సమీపంలో ఉన్న కుమ్మరి కుంట చెరువు నుండి చిన్నదామెర చెరువుకు, ఉన్న గొలుసు కట్టుకాలువ కనుమరుగు చేశారు..స్థానిక బాధిత రైతులు రెవెన్యూ, ఇరిగేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా చర్యలు తీసుకోక పోగా, ఫిర్యాదు చేసిన పాపానకి కబ్జాదారులు రైతులపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి..చెరువును పరిశీలించేందుకు 2024 ఫిబ్రవరి 17న తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో చిన్నదామెర చెరువును, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో న్యాయ నిపుణుల బృందం, సందర్శించింది.. చెరువులో అక్రమ కట్టడాలు ఉన్నట్టు నిర్ధారణకు వచ్చిన బృందం, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.. పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని గమనించిన అధికారులు సర్వే నిర్వహించి 8-20 ఎకరాల్లో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందిన "ఐఏఆర్ఇ అండ్ యంఎల్ఆర్ఐటియం" కళాశాల భవనాలు ఉన్నట్టు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.. ఆతర్వాత కూల్చివేతల డ్రామాను రక్తికట్టించిన అధికారులు, పూర్తిగా చర్యలు తీసుకోకుండా వదిలేశారు.. ఇదంతా ఏడాదిన్నర క్రితం అధికారులు, కబ్జాదారుల నడుమ కొనసాగిన హైడ్రామా..!
పూర్తి సమాచారంతో.. పెన్ పవర్ ప్రత్యేక కథనం త్వరలో..
About The Author

మాధవ్ పత్తి, మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.