ఏప్రిల్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు?
విశాఖ కేంద్రంగా కొత్త అధ్యాయం – అపాయింటెడ్ డే ప్రకటించనున్న కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌కు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్ కల సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడుతోంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు అధికార వర్గాల సమాచారం. అదే రోజును కొత్త జోన్‌కు “అపాయింటెడ్ డే”గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని రైల్వే వర్గాలు సూచిస్తున్నాయి.
బ్యూరో రిపోర్ట్ – పెన్ పవర్ విశాఖపట్టణం, ఫిబ్రవరి 17:
ఆంధ్రప్రదేశ్‌కు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్ కల సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడుతోంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు అధికార వర్గాల సమాచారం. అదే రోజును కొత్త జోన్‌కు “అపాయింటెడ్ డే”గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని రైల్వే వర్గాలు సూచిస్తున్నాయి.

విభజన ప్రక్రియకు తుది దశ : ప్రస్తుతం సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే విభజనలో భాగంగా ఆరు డివిజన్లు విడిపోతున్నాయి. విభజన అనంతరం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే కొనసాగనున్నాయి.
కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో: విశాఖపట్నం డివిజన్ (కొత్తగా ఏర్పాటు), విజయవాడ డివిజన్ , గుంటూరు డివిజన్ ,గుంతకల్లు డివిజన్, తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని కొంత భాగం ఇవి కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అపాయింటెడ్ డేపై ఆసక్తి : ఏప్రిల్ 1ను అపాయింటెడ్ డేగా ప్రకటించనున్నారన్న ప్రచారం రైల్వే అధికారుల్లో చురుగ్గా వినిపిస్తోంది. ప్రస్తుతం సుమారు ఆరు వారాల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, అంత తక్కువ సమయంలో అన్ని సాంకేతిక, పరిపాలనా ప్రక్రియలు పూర్తి అవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విభజనకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే తొమ్మిది నెలల క్రితమే రైల్వే బోర్డుకు సమర్పించినట్లు సమాచారం.
విభజన హామీ – దశాబ్దపు నిరీక్షణ : ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరాంధ్ర ప్రజలు ఈ అంశంపై పలు మార్లు వినతులు అందజేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో భారత కేబినెట్ కొత్త జోన్‌కు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి జీఎం నియామకం, సరిహద్దుల నిర్ణయం, రైళ్ల నిర్వహణ, ఆదాయ-వ్యయాల విభజన వంటి అంశాలపై కసరత్తు కొనసాగుతోంది.
తాత్కాలిక కార్యాలయం – శాశ్వత భవన నిర్మాణం : విశాఖపట్నం సిరిపురంలో ఉన్న డెక్ భవనంలో జీఎం తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెండు అంతస్తులను లీజుపై తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ముడసర్లోవలో శాశ్వత ప్రధాన కార్యాలయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. గత ఏడాది జనవరిలో నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మొత్తం 54 ఎకరాల్లో 12 అంతస్తుల పరిపాలనా భవనాన్ని రూ.192 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు.
ఉత్తరాంధ్రకు నూతన దిశ : దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమైతే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిపాలనా వేగం పెరగడం, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల పెరుగుదల వంటి అంశాల్లో ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు నిరీక్షణలో ఉన్న ఈ ప్రాజెక్టుకు ఏప్రిల్ 1 అపాయింటెడ్ డేగా ప్రకటిస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నిజమవుతుందని చెప్పొచ్చు.
