వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 26:ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గొర్లే వీర వెంకట్ సూచించారు.వర్షాకాలంలో కలుషిత నీరు, కలుషిత ఆహారం, అపరిశుభ్ర వాతావరణం వల్ల విష జ్వరాలు,డెంగ్యూ, టైఫాయిడ్,విరేచనాలు,ఇతర అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా వ్యాధులు ప్రబలకుండా నివారించాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అత్యవసరమన్నారు."చిన్నపాటి జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తేనే ఈ సీజనల్ వ్యాధులు దరి చేరవు," అని వెంకట్ అన్నారు.ఇంతే కాకుండా, గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు మరియు వైద్య సిబ్బంది తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించాలని, వ్యాధుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్ల దగ్గర చిన్న పిల్లలు చేరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే మనం పెంచే మూగజీవాలను కూడా అప్రమత్తంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనని ఆయన పేర్కొన్నారు.వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్న రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గొర్లే వీర వెంకట్ హితవు పలికారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.