ఏపీలో మరో ఆరు కొత్త జిల్లాలు – తుది దశలో పునర్విభజన!

six-more-new-districts-in-ap-–-redistricting-in-final

 ఏపీలో మరో ఆరు కొత్త జిల్లాలు –  తుది దశలో పునర్విభజన!

  • జిల్లాల పునర్విభజనపై రేపు సీఎంతో చర్చ, నవంబర్ 7న క్యాబినెట్‌లో ఆమోదం
  • 200 వినతులు, ప్రజాప్రతినిధుల సూచనలు — ఉపసంఘం సమగ్ర సమీక్ష
  • రంపచోడవరం గిరిజన జిల్లా, మార్కాపురం జిల్లాలపై సానుకూలత
  • అద్దంకి, మడకశిర సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్లకు సిఫార్సులు

 

రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో క్యాబినెట్ ఉపసంఘం కీలక భేటీ — అమరావతి, మార్కాపురం, రంపచోడవరం, పలాస, గూడూరు, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాల ప్రతిపాదనలు — ప్రజల ఆకాంక్షలు, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా తుది రూపు

000 copy
అమరావతి,  పెన్ పవర్అక్టోబర్ 27:
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పుపై ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంది. జిల్లాల పునర్విభజనకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వినతులు, ప్రతిపాదనలపై చర్చించి, ఆయన సూచనల మేరకు తుది నివేదికను సిద్ధం చేయనుంది. ఈ నివేదికను నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది.పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల సరిహద్దులు, పేర్ల మార్పు కోసం ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, సంఘాల నుంచి దాదాపు 200 అర్జీలు అందాయి. వీటిని సమీక్షించి, జిల్లా అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. జనగణన ప్రారంభానికి ముందు డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

కొత్త జిల్లాలపై సిఫార్సులు:
వైసీపీ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించగా, ఆ సమయంలో తలెత్తిన వివాదాలు, ప్రజా అసంతృప్తులను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పుడు 26 జిల్లాలను 32గా పెంచే యోచనలో ఉంది. ఈ క్రమంలో అమరావతి, మార్కాపురం, రంపచోడవరం, పలాస, గూడూరు, మదనపల్లి కేంద్రాలుగా ఆరు కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉపసంఘం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. మార్కాపురం జిల్లా కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో ఏర్పాటు చేయనున్నారు. అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుండి కొన్ని నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ప్రతిపాదన ఉంది. ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటుపైనా చర్చ జరగనుంది. పలాస, గూడూరు, మదనపల్లి జిల్లాల ప్రతిపాదనలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

కొత్త రెవెన్యూ డివిజన్లు:  కొత్త జిల్లాలతో పాటు అద్దంకి, మడకశిర సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఒక నియోజకవర్గం రెండు, మూడు డివిజన్ల పరిధిలో ఉండటంతో తలెత్తిన ఇబ్బందులను తొలగించే మార్పులు సూచించబడ్డాయి. ఆదోని వంటి పెద్ద మండలాలను విభజించే అంశంపైనా చర్చ జరగనుంది. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలా లేక ప్రకాశం జిల్లాలో కలపాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

About The Author

Related Posts