కోదాడ లాకప్ డెత్ ఘటన: ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్
మేజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు
కోదాడ లాకప్ డెత్ ఘటన: ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్, మేజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు
హైదరాబాద్ పెన్ పవర్ జనవరి 24:
సూర్యాపేట జిల్లా కోదాడలో చోటుచేసుకున్న దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను అత్యంత గంభీరంగా పరిగణించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, మేజిస్టీరియల్ విచారణ నిర్వహించాలని ఆదేశిస్తూ తెలంగాణ డీజీపీ, సూర్యాపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది.
గత ఏడాది నవంబర్ నెలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ కర్ల రాజేష్ కోదాడ పోలీసులను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజేష్‌ను కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, అక్కడ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కలిసి రాజేష్‌పై అమానుషంగా దాడులు చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు. పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక కర్ల రాజేష్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
ఈ లాకప్ డెత్ ఘటనపై ఢిల్లీ యూనివర్సిటీలో లా విద్యను అభ్యసిస్తున్న, రంగారెడ్డి జిల్లాకు చెందిన సభావత్ కళ్యాణ్ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధితుడికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
సభావత్ కళ్యాణ్ ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది వారాల లోపు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి చర్యల నివేదికతో పాటు, మేజిస్టీరియల్ విచారణ నివేదికను కూడా సమర్పించాలని స్పష్టంగా పేర్కొంది.
లాకప్ డెత్ వంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, మానవ హక్కుల ఉల్లంఘనలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై ప్రభుత్వ చర్యలు, విచారణ ఫలితాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

