దేవరపల్లి పంచాయతీలో గృహ నిర్మాణాలకు గ్రౌండింగ్ మేళా!
ఉగాది నాటికి ఇళ్ల పూర్తి లక్ష్యం : ఎంపీడీవో BHV రమణబాబు
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జనవరి 30:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దేవరపల్లి పంచాయతీ పరిధిలోని మంగళపాలెం గ్రామంలో శుక్రవారం గృహ నిర్మాణాల కోసం గ్రౌండింగ్ మేళా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో గృహాలు లేని నిరుపేదలకు ఒక్కో గృహానికి రూ.2.39 లక్షల చొప్పున గూడెం కొత్త వీధి మండలానికి మొత్తం 2200 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల గృహాల నిర్మాణానికి అధికారికంగా గ్రౌండింగ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బి.హెచ్.వి. రమణబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను ఉగాది నాటికి పూర్తిచేసి గృహప్రవేశాలు నిర్వహించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. గూడెం కొత్త వీధి మండలంలోని లబ్ధిదారులు మంజూరైన గృహాల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మండలంలో అన్ని ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిరిబాల బుజ్జిబాబు, ఎంపీడీవో కార్యాలయ కార్య నిర్వాహక అధికారి ఇమ్మానియేల్, డిప్యూటీ ఎంపీడీవో వి.జగదీష్ గృహ నిర్మాణ శాఖ ఏఈ పసుపులేటి లక్ష్మీ విమల పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పొత్తురు కొండలరావు,బీజేపీ మండల అధ్యక్షులు కాకూరు శేఖర్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు కొయ్యం బాలరాజు, వర్క్ ఇన్స్పెక్టర్లు సెగ్గే సూరిబాబు, పసుపులేటి చిట్టిపడాల్ తదితరులు హాజరయ్యారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.
