ప్రజా ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
public-health-is-the-prime-objective-of-the-coalition-government
మాది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే కేవలం శంకుస్థాపనలు చేసి వదిలేయడం కాదని, ప్రారంభించిన పనులను పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయడమే నిజమైన అభివృద్ధి అని ఆమె పేర్కొన్నారు.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
బుచ్చిరెడ్డిపాలెం, పెన్ పవర్ | ఫిబ్రవరి 10
బుచ్చిరెడ్డి పాళెం పట్టణం 1వ వార్డు కట్టుబడి పాళెంలో రూ.1 కోటి 16 లక్షల వ్యయంతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఇంతకుముందు వైద్య సేవలు అందుబాటులో లేక కట్టుబడి పాళెం వాసులు బుచ్చిరెడ్డిపాలెం లేదా నెల్లూరు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభంతో ఆ సమస్య తీరిందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఈ భవనం తన హయాంలో పూర్తవడం సంతోషకరమని తెలిపారు.

చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తిగా వదిలేసిన అనేక భవనాలను పూర్తి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. ప్రజావసరాలను గుర్తించి ప్రజాధనం సద్వినియోగం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇకపై అత్యవసర వైద్య చికిత్స కోసం పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదని, ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఈ అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేని నిరుపేదల పట్ల వైద్య సిబ్బంది సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. 24 గంటలపాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని డాక్టర్లను కోరిన ఎమ్మెల్యే, త్వరలోనే ఈ కేంద్రానికి అవసరమైన వైద్య పరికరాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు.

వైద్య రంగానికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరేలా చూడాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశాఖాధికారి సుజాత, బుచ్చిరెడ్డి పాళెం మున్సిపల్ కమిషనర్ డి. బాలకృష్ణ, మున్సిపల్ ఛైర్పర్సన్ మోర్ల సుప్రజ, స్థానిక కౌన్సిలర్ కత్తి నాగరాజు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఎం.వి. శేషయ్య, పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు టంగుటూరి మల్లారెడ్డి, మాజీ జొన్నవాడ ఆలయ ఛైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, టీడీపీ నాయకులు నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, నందకుమార్, వైస్ ఛైర్మెన్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

