మొంథా తుఫానులో రక్షణ యజ్ఞం
raksha-yajna-in-montha-cyclone
ఎస్పీ హర్షవర్ధన్ రాజు దూకుడుతో జిల్లాలో చురుగ్గా సహాయక చర్యలు లో పోలీసులు
ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తం — ప్రజల భద్రతే ప్రధాన ధ్యేయం
తీరప్రాంతాల్లో ఎస్పీ పర్యటన — క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ
వాగులు, వంకలు ఉప్పొంగిన గ్రామాల్లో రక్షణ చర్యలు వేగవంతం
ప్రజల కోసం అందుబాటులో 24 గంటల పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్
తుఫానులో తడిసి ముద్దయిన పోలీసులు, దూసుకుపోతున్న హర్షవర్ధన్ రాజు
క్రైమ్ బ్యూరో పెన్ పవర్ ప్రకాశం జిల్లా, అక్టోబర్ 29 :
మొంథా తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలులు, తీరప్రాంతాల్లో ఉధృతమైన గాలివానల నేపథ్యంలో ప్రజల భద్రత కోసం జిల్లా పోలీసులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ అధికారులు సన్నద్ధంగా ఉండి, వివిధ శాఖలతో సమన్వయపూర్వకంగా తుఫాను నిర్వహణలో నిమగ్నమయ్యారు.

తుఫాను నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయం — వేగవంతమైన చర్యలు
ప్రకాశం జిల్లా పోలీసులు రెవెన్యూ, ఆరోగ్యం, మునిసిపల్, పంచాయతీ, విద్యుత్, అగ్నిమాపక మరియు వైద్య శాఖల అధికారులతో కలసి రక్షణ, నివారణ చర్యలు అమలు చేస్తున్నారు. తీరప్రాంత పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బలగాలను మోహరించి, ప్రజల ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. తుఫాను తీవ్రత పెరిగిన ప్రాంతాల్లో పోలీసులు రాత్రింబవళ్ళు పహారాలు కాస్తూ, అవసరమైతే తక్షణ సాయం అందిస్తున్నారు. ఈదురుగాలుల వలన రహదారులపై పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి రాకపోకలు సాఫీగా సాగేటట్లు చేస్తున్నారు.

తీరప్రాంతాల్లో ఎస్పీ పర్యటన — క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ
వేకువజామునుంచే క్షేత్రస్థాయిలో తిరుగుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పరిస్థితి అంచనా వేస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ప్రాంతంలో ప్రజల భద్రత కోసం ప్రత్యేక సూచనలు జారీ చేశారు. “జిల్లాలో కలియ తిరుగుతున్న ఒకే ఒక్కడు” అనే వ్యాఖ్య ఇప్పుడు ప్రజల నోట వినిపిస్తుంది.


వాగులు, వంకలు ఉప్పొంగిన గ్రామాల్లో రక్షణ చర్యలు వేగవంతం
వాగులు వంకలు ఉప్పొంగడంతో ముప్పు ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఓంగోలు నగరంలోని పాపా కాలనీ, బిలాల్ నగర్, కరుణా కాలనీ ప్రాంతాల్లో నీరు చేరడంతో, పోలీసులు ప్రజలను సురక్షిత స్థలాలకు తరలించి తాత్కాలిక ఆశ్రయాలు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య సిబ్బందితో కలిసి పోలీసులు సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లవద్దని, వాగులు దాటరాదని హెచ్చరికలు జారీ చేశారు.


ప్రజల కోసం అందుబాటులో 24 గంటల పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్
తుఫాను సమయంలో ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా ప్రజలు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని ఎస్పీ తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలు తప్పక పాటించాలని, అనవసరంగా బయటకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు.
హర్షవర్ధన్ రాజు దూకుడు — ముందస్తు, అనంతర చర్యల్లో చురుకైన పర్యవేక్షణ
తుఫానుకు ముందు, తుఫాను సమయంలో, తుఫాను తర్వాత కూడా నిరంతరం క్షేత్రస్థాయిలో తిరుగుతూ పరిస్థితులను పరిశీలిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా ప్రజలలో నమ్మకాన్ని నింపారు. అధికారులతో సమన్వయం చేస్తూ ప్రతి శాఖను ఒక తాటిపైకి తెచ్చి, రక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.
తుఫానులో తడిసి ముద్దయిన పోలీసులు, దూసుకుపోతున్న హర్షవర్ధన్ రాజు
ప్రకాశం జిల్లాలో ప్రజల ప్రాణ రక్షణలో “డ్యూటీ ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్” ధ్యేయంతో కృషి చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులను జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.





