అర్థరూపాయికి టమోటా

tomatoes-to-fifty-paisa

అర్థరూపాయికి టమోటా


కర్నూలు, పెన్ పవర్  ఫిబ్రవరి 22: 
టమాటా ధరలు రోజురోజుకూ పతనం అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రెండు రూపాయలకు కూడా మార్కెట్ లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడం లేదు. మొన్నటి వరకూ కిలో నలభై నుంచి యాభై వరకూ బయట మార్కెట్ లో పలికిన టమాటా ధర నేడు పది రూపాయలకు పడిపోయింది. టమాటా తినే వినియోగదారులకు ఇది లాభదాయకమే అయినప్పటికీ, దానిని పండించే రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తికొండ, మదనపల్లి మార్కెట్ లో కిలో టమాటా ధర అర్థ రూపాయికి కూడా కొనేవారు లేరు. దీంతో టమాటా పండించిన రైతులు కనీసం తాము పండించిన దానికి పెట్టుబడి రాకపోవడంతో మార్కెట్ బయట పారేసి వెళుతున్నారు. మరికొందరు రైతులు మాత్రం పొలాల్లోనే పశువుల మేతగా టమాటాను వదిలేస్తున్నారు. టమాటా కోయడానికి రైతులు కూలీలకు చెల్లించాల్సిన మొత్తం కూడా రాదని తెలియడంతో దానిని కోయడం అనవసరమని పొలాల్లోనే వదిలేస్తున్నారు. పశువులకు మేతగా తీసుకెళ్లవచ్చని కొన్ని చోట్ల పశువుల కాపర్లకు రైతులు చెబుతున్నారు. దీంతో టమాటా ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని తెలిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా నవంబరు మాసం నుంచి టమాటా దిగుబడులు ఎక్కువగా వస్తుంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి అవుతుంటాయి. అందుకే కావాల్సిన దానికన్నా ఎక్కువ టమాటా మార్కెట్ లోకి వస్తుంది. దీని వల్ల ధరలు పడిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.  టమాటా ధరల రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఏపీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయశాఖ చర్యలను ప్రారంభించింది. అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ప్రభుత్వం టమాటా కోనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఇప్పటివరకు రైతుల నుంచి కిలో ఎనిమిది రూపాయల చొప్పున వెయ్యి క్వింటాళ్ల టమాటా కొనుగోలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, గుంటూరు రైతుబజార్లలో టమాటా విక్రయాలు చేపట్టారు. నాఫెడ్, ఏసీసీఎఫ్ ద్వారా ఆపరేషనల్ ఖర్చులు భరించేలా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కిలో టమాటాపై పది రూపాయల నుంచి పదిహేను రూపాయల గిట్టుబాటు ధర అందేలా ఏపీ వ్యవసాయశాఖ చర్యలు ప్రారంభించింది. కానీ ఇప్పటికీ రైతులు తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని చెబుతున్నారు. తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో విక్రయించేలా కేంద్రంతో చర్చలు ప్రారంభించింది.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల