ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి ఇద్దరు కు తీవ్ర గాయాలు:విషాదంలో మునిగిన పెంటపాడు గ్రామం
చింతపల్లి పెన్ పవర్ మే 17: చింతపల్లి నర్సీపట్నం ప్రధాన రహదారి రౌరింతాడ గ్రామ సమీపంలో జాతీయ రోడ్డుపై జరిగినఘోరరోడ్డుప్రమాదంఒకకుటుంబాన్ని విషాదంలో ముంచేసింది.పెంటపాడు గ్రామానికి చెందిన నల్లాల చందర్రావు (38), భార్య కృష్ణవేణి (32), చందర్రావు అన్నయ్య కుమారుడు అఖిలేష్ (13) కలిసి బంధువుల రజస్వల కార్యక్రమానికి చిట్రాలగొప్పు వెళ్లి హాజరై తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విషాదకర ఘటన రౌరింతాడ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. భద్రాచలం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఆ కుటుంబం ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చందర్రావుకు రెండు కాళ్లు, చేతులు విరిగిపోగా, కృష్ణవేణికి తలపై తీవ్ర గాయమైంది. అఖిలేష్ రెండు కాళ్లు విరిగిపోయాయి. అటుగా వెళుతున్న ప్రయాణికులు వెంటనే 108 సర్వీసు వాహనానికి సమాచారం అందించగా, సిబ్బంది అప్రమత్తంగా స్పందించి ముగ్గురినీ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చందర్రావుకు చికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధపడుతున్న సమయంలోనే చందర్రావు మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన కృష్ణవేణి, అఖిలేష్‌ను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్ కి తరలించారు. మృతుడు చందర్రావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మృతి చెందిన నల్లల చందర్రావు బైక్ మెకానిక్ గా పెంటపాడు గ్రామంలో ఎటువంటి బైక్ అయినా రిపేర్ చేసే నైపుణ్యం ఆయనలో ఉందని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంచాలా బాధాకరంగా ఉందని స్నేహితులు వాపోతున్నారు సమాచారం అందుకున్న చింతపల్లి సీఐ ఎం. వినోద్ బాబు, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విచారించి, సంబంధిత కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.