తుఫాన్ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి:జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్
👉28, 29 తేదీలు కీలకం
స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి, పెన్ పవర్,అక్టోబర్ 25 : ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ అన్నారు.అక్టోబర్ 26 నుండి 29 తేదీ వరకూ భారీ వర్ష సూచనని వాతావరణ శాఖ ప్రకటించారని కలెక్టర్ పేర్కొన్నారు. 28,29 తేదీలు చాలా ముఖ్యమని, 28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయం లో ఆంధ్రప్రదేశ్ లో మంతా తుఫాన్ తీరం దాటనున్నదని కలెక్టర్ అన్నారు. 4 రోజులు విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందస్తు చేపట్టవలసిన చర్యలు దృష్ట్యా అన్ని శాఖలు సమన్వయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని అధికారులు ముఖ్యంగా జలవనరులు, రెవిన్యూ, పోలీసు,రవాణా, మత్స్యశాఖ, పంచాయతీ రాజ్, రహదారులు భవనాలు, వ్యవసాయ తదితర శాఖల అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలని, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తం చేయాలన్నారు. జనరేటర్లు, త్రాగునీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో దండోరా వేసి ప్రజలకు అప్రమత్తం చేయాలని సూచించారు. నిత్యావసర సరుకుల పంపిణి పై ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆర్ అండ్ బి, ఈపిడిసిఎల్, వైద్య ఆరోగ్య, మత్స్య సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు అప్రమత్తం అవసరమన్నారు. మత్స్యకారులు ఎవరు వేటకి వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. ముంపుకు గురైన ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను తుఫాన్ రిలీఫ్ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చు తల్లులు, చిన్నారులు, వృద్ధులను, వైద్య సహాయం అత్యవసరంగా కావలసినవారిని ప్రత్యేక శ్రద్ధతో పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అలాగే ఎక్కడైనా రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం కలిగితే పునరుద్ధరణ పనులు తక్షణమే చేపట్టాలన్నారు. కచ్చా ఇళ్ళు, అంగన్వాడీలు, పాఠాశాల భవనాలు పై ప్రత్యేక దృష్టి సారించి సత్వరచర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఈ టెలికాన్ఫెరెన్స్ లో ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీపూజ, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్స్, ఎంపీడీఓలు, డిఎస్పిలు, ఆర్అండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఎపిఎస్పిడిసియల్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా విద్యాశాఖాదికారి, వ్యవసాయ, మత్స్య, అగ్నిమాపక అధికారులు ఉన్నారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.
