'వర్టెక్స్' భారీ అక్రమ షెడ్డుకు..! అనుమతులేవి "టిపిఎస్"గారు..!
శంభీపూర్‌లో టిజి-బిపాస్ చట్టాన్ని ఉల్లంఘించి షెడ్డు నిర్మాణం..
దుండిగల్ మున్సిపాలిటీలో అధికారుల విధుల నిర్వహణ ప్రజలను ప్రమాదంలో పెడుతుంది.. టిజి-బిపాస్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ,అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారు.. అధికారుల తీరుపై పలువురికి ఆగ్రహం తెప్పిస్తున్న వైనం.. ప్రమాదాలను నివారించే నిబంధనలు పాటించకుండా..! నిధులు సమకూరితే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.. నిబంధనలకు తిలోదకాలు పలికి, మున్సిపల్ వ్యాప్తంగా అక్రమ షెడ్లు, అక్రమ కట్టడాలతో పేరుకు పోయింది.. విజిలెన్స్ వ్యవస్థను కూడా మున్సిపల్ అధికారులు మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం..
బడా నిర్మాణ సంస్థకు మినహాయింపు..! ఇలాంటి అధికారులు అవసరమా..?
చర్యలకు ఆకుల సతీష్ డిమాండ్..! నిర్లక్ష్యం వహిస్తే మూల్యం తప్పదు..
నిర్లక్ష్యపు నీడలో దుండిగల్ మున్సిపల్ అధికారుల విధుల నిర్వహణ..
అక్రమ షెడ్లు-నిర్మాణాల కోసమే అన్నట్టు టౌన్‌ప్లానింగ్ అధికారి విధులు..!
కాసులు కురిపించే బడా నిర్మాణ సంస్థలకు, భారీ అక్రమ కట్టడాలకు టిపిఎస్ అండ..?
ఉత్సవ విగ్రహంలా మున్సిపల్ కమిషనర్,అక్రమ నిర్మాణాల నియంత్రణలో విఫలం..
పైనుండి(లోకల్‌బాడీ) ఒత్తిడి లేదు.. సిఫార్సులకు కొరత లేదు..?
ధనార్జనే ధ్యేయంగా, పార్కు స్థలాలను సైతం కబ్జాదారులకు ధారాదత్తం..
ప్రజల సొమ్ముతో వేతనాలు.. నేతల సిఫార్సులంటూ ప్రమాదకర కట్టడాలు..
మున్సిపల్ అధికారులకు "బాధ్యత ఉందో లేదో"..? ఉన్నతాధికారులే తేల్చాలి..
దుండిగల్, పెన్ పవర్, నవంబర్ 2:
దుండిగల్ మున్సిపల్ పరిధిలోని శంబిపూర్ గ్రామ శివారు, సర్వే నెంబర్ 30లో, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ షెడ్డుపై మున్సిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారి అంతగా సహకరించడానికి కారణం..? ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోక పోవడానికి కారణం..? ముడుపులు దండిగా ఇవ్వగలిగే బడా నిర్మాణ సంస్థ అయి ఉండవచ్చని పలువురు భావించిన విధంగానే జరిగింది.. అధికారులే రక్షణ వలయంగా మారిన ఆ అక్రమ షెడ్డు ఓ బడా నిర్మాణం సంస్థకు చెందినది అంటూ, ఆకుల సతీష్ శనివారం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.. ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ మున్సిపల్ పరిధి శంభీపూర్ గ్రామ పరిధి సర్వే నెం.30లో ఉన్నదే 00-32 గుంటల వ్యవసాయ భూమిలో నాలా కన్వర్శన్ కూడా లేకుండానే..! "వర్టెక్స్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ" భారీ అక్రమ షెడ్డును నిర్మించిందని సతీష్ ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఈ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్, హెచ్.ఎం.డి.ఏ అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.. అనుమతులు లేకుండా నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ, మున్సిపల్ అధికారులు మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.. తెలంగాణ మున్సిపల్ చట్టం–2019కి విరుద్ధంగా అక్రమ నిర్మాణాలను అధికారులే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు..
టిజి-బిపాస్ చట్టాన్ని ఉల్లంఘించి..
తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 178 (2, 3, 4, 5) ప్రకారం ఎవరైనా అనుమతి లేకుండా భవనం నిర్మిస్తే, మున్సిపల్ అధికారులు ఆ నిర్మాణాన్ని తక్షణం కూల్చివేసే అధికారం ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమతులు రేకెత్తిస్తుంది..
అధికారుల మౌనానికి అర్ధం..?
అనుమతులు లేకుండా మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంటే.. మున్సిపల్ అధికారులు స్పందించక పోవడం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.. దుండిగల్ మున్సిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది కళ్లముందే భారీ షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి..!ఇదంతా అధికారుల సహకారం లేకుండా సాధ్యమేనా..? ఈ వర్టెక్స్ కంపెనీ షెడ్డుకు బీఆర్ఎస్ సోదరుల సిఫార్సులు కూడా ఉండవచ్చని భాస్తున్నారు..
శంబిపూర్‌లో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణం కేవలం ఒక షెడ్డు సమస్య మాత్రమే కాదు.. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడిన నగరపాలక సంస్థల చట్టాల అమలు వైఫల్యానికి సూచికగా పేర్కొనవచ్చు.. దుండిగల్ మున్సిపాలిటీ ఏర్పడి సుమారు 7-8 ఏళ్ళు గడిచినా, అధికారుల్లో పారదర్శకత లోపిస్తుంది.. ధనార్జనే ధ్యేయంగా విధులు నిర్వర్తించడం పరిపాటిగా మారింది.. ఈ వర్టెక్స్ కంపెనీకి చెందిన అక్రమ షెడ్డు మాత్రమే కాదు.. టౌన్‌ప్లానింగ్ అధికారుల ఖాతలో నేటికీ చర్యలు తీసుకోని మరికొన్ని అక్రమ షెడ్లు అక్రమ, నిర్మాణాలను, నేటి "పెన్ పవర్" దినపత్రికలో పాఠకుల కోసం.. దుండిగల్ మున్సిపల్ అధికారుల "కరెప్షన్ అంటారో- లేక నేతల సిఫార్సుల ముందు, టిజి-బిపాస్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని చెబుతారో ప్రజలు గమనించాలి.. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా..! కరెప్షన్ అధికారుల తీరు మారకపోవడం బాధాకరం..
About The Author
మాధవ్ పత్తి, మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
